Tuesday, December 9, 2008

ఆ రెండేళ్లూ ఆయనకు తల్లినయ్యాను...

ఆయన నూటొక్క జిల్లాల అందగాడు.దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ విలక్షణమైన మాటతీరుతో యావతాం«ద్రుల అభిమానాన్ని చూరగొన్న చక్కని నటుడు . దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో ఆయన కుప్పికూలిపోతే....నేనున్నాను అంటూ బాసటగా నిలిచింది ఆయన సతీమణి. తన చేయి అందుకుని తనను నడిపించాల్సిన భర్త ముందుకు నడవలేని పరిస్థితుల్లో ఆ బాధ్యతను తను తీసుకుని తన భుజాలతో ఆయనకు ఆసరా అందించిన సహధర్మచారిణి ఆమె. తన ముగ్గురు పిల్లలకు తోడుగా అప్పటికే పసిపిల్లాడిలా మారిన ఈయననూ చేర్చి కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి ఆమె. ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఘోర ప్రమాదం తర్వాత కూడా ఆ నూటొక్కజిల్లాల అందగాడు నూటొక్క సినిమాల్లో నటించేందుకు స్ఫూర్తిగా నిలిచారు, అర్థాంగి అనే పదానికి నిజమైన అర్థాన్ని చెప్పారు. ఆ నూటొక్కజిల్లా అందగాడు నూతన్‌ ప్రసాద్‌, ఆయన ధర్మపత్ని ప్రమీలల దాంపత్యంలోని ఆత్మీయానురాగాల ప్రతిబింబం నేటి అనుబంధం.

ఇరవై ఏళ్ల నాటి దుస్సంఘటన ఇది. అది తలచుకుంటే చాలు ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది, నవనాడులూ కుంగినట్టనిపిస్తుంది. 1989, ఫిబ్రవరి 17న మద్రాస్‌లోని కెకెనగర్‌... బామ్మ మాట బంగారు మాట షూటింగ్‌ స్పాట్‌లో ఉదయం పదింటికి ఆయనకు యాక్సిడెంట్‌ అయింది. ఆ సమయంలో నేను మద్రాస్‌లో నేను. ఓ పెళ్లికోసమని హైదరాబాద్‌ వచ్చాను. యాక్సిడెంట్‌ వార్త తెలియగానే సాయంత్రం ఫ్లైట్‌లో మద్రాస్‌ వచ్చేశాను. నేను వచ్చేప్పటికే ఆయన హాస్పటల్‌లో ఉన్నారు. స్పైన్‌కి ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు అన్నీ సిద్ధం చేసుకుని నాకోసం ఎదురు చూస్తున్నారు నా సంతకం కావాలని.మూడునెలలు అనుకున్నది రెండున్నరేళ్లు...... చాలా పెద్ద దెబ్బే తగిలిందని అర్థమవుతోంది నాకు కొంచెం కొంచెంగా డాక్టర్ల హడావుడి అదీ చూస్తుంటే. అయితే ఆపరేషన్‌ చేస్తున్నారు కదా ఎంత లేదన్నా ఓ మూడునెలల్లోనే కోలుకుంటారు ఈయన. మళ్లీ షూటింగ్‌లంటూ బిజీ అయిపోతారు,చాలా జాగ్రత్త చూసుకోవాలనే అనుకుంటున్నాను ఎంతసేపటికి. కానీ నా అంచనాలకు విరుద్ధంగా మేము హాస్పటల్లో గడిపింది రెండున్నరేళ్లు. ఈ ప్రమాదం జరిగేటప్పటికి పిల్లలు ముగ్గురూ చిన్నవాళ్లే. పెద్దఆమ్మాయి కనకమహాలక్ష్మికి పదమూడేళ్లు, అబ్బాయి పవన్‌కి పది ఏళ్లు. ఆఖరమ్మాయి భాగ్యలక్ష్మి ఆరేళ్ల పిల్ల. వీళ్లు ఇంట్లో ఒంటరిగా ఉండలేరు, ఆక్కడ హాస్పటల్‌లో ఆయన దగ్గరా నేను లేకపోతే కుదరని పరిస్థితి. ఎవరినీ ఒంటరిగా వదల్లేక అందరినీ చూసుకోలేక నరకమే అనుభవించాను. అసలు ఆ సమయంలో నేనేమి తిన్నానో, ఎలా ఉన్నానో కూడా తెలీదు నాకు. అప్పటికీ మా అత్తయ్య అంటే ప్రసాద్‌ గారి అమ్మ ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకుంలూ ఉంటే నేను ఆయన దగ్గర హాస్పటల్‌లో ఉండేదాన్ని. ఉదయం ఏడింటి నుంచి రాత్రి 11, 12 గంటల దాకా హాస్పటల్‌లో తన దగ్గర ఉండీ ఆ రాత్రి మళ్లీ ఇంటికి వెళ్లేదాన్ని . అప్పటికే పిల్లలు బెంగ పెట్టేసుకునే వాళ్లు. మళ్లీ తెల్లవారి ఆరింటికల్లా ఆయనదగ్గరకు పరిగెత్తాల్సిందే. ఈలోపు ఆయన్ని పలకరించడానికి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వాళ్లతో మాట్లాడటంలో కాస్త లేటయి హాస్పటల్‌కి వెళ్లేటప్పటకి ఈయన ఎదురుచూస్తూ ఉండేవారు. ఇంత ఆలస్యమయింది ఏంటీ? నన్నలా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్‌ అంటూ దిగులు పడిపోయేవారు. నాకు ఆకలిగా ఉంది అంటూ చంటిపిల్లాడిలా అలక చూపేవారు. వేసవి సెలవుల్లో రోజంతా పిల్లలు ఇంట్లో బెంగగా ఉంటారని నాతో పాటు హాస్పటల్‌కి తెచేసేదాన్ని. పైగా ఆ మండువేసవిలో పాపం వాళ్లు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నా ఈయనను వదిలి వాళ్లను చూసుకునే పరిస్థితి ఉండేదికాదు. అందుకని నాతో పాటు వచ్చేవాళ్లు. వాళ్లను హాస్పటల్‌ కింద పార్క్‌లో వదిలేసేదాన్ని ఆడుకోమని. ఈయన గది థార్డ్‌ ఫ్లోర్లో ఉండేది. ఆయన్ని చూస్తూ మధ్య మధ్యలో కిందకు వచ్చి పిల్లలకు ఏదో తినిపించి, వాళ్లను కాస్త ఆడించి పైకివెళ్లేసరికి ఈయన బెంబేలెత్తిపోయేవారు. ఇంతసేపయిందేంటి? నన్ను అలా వదిలి వెళ్లిపోయావ్‌ ? నాకు భయంగా ఉంది అంటూ చిన్నపిల్లాడిలా మారాం చేసేవారు. ఆయనకు పళ్లు, మందులు అవీ ఇచ్చి బయటకు వచ్చి చాలా ఏడ్చేదాన్ని. భగవుంతుడా నాకేంటి శిక్ష అని. నాకు ముగ్గురు కాదు నలుగురు పిల్లలు అనుకునేదాన్ని. అలాగే ఆయనకి భార్యగా కాక తల్లిగా మారి తనను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. హాస్పటల్‌ బెడ్‌పై నుంచే డబ్బింగ్‌ ఈయనకు యాక్సిడెంట్‌ అయ్యేప్పటికీ 10 సినిమాలు షూటింగ్‌ పార్ట్‌ పూర్తిచేసుకుని డబ్బింగ్‌ దశలో ఉన్నాయి. అలా ప్రమాదం జరిగిన వారానికే డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. ఈయనేమో ప్రమాదం తాలూకు షాక్‌ నుండి ఇంకా తేరుకోలేదు. పైగా చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. అందుకే నా వల్ల కాదు, నేను చెప్పనంటే చెప్పను అంటారు. అప్పుడు ...మీకేం కాలేదు, ఏం భయం లేదు, పక్కనే నేనుంటాను చెప్పండి అని ధైర్యం ఇస్తే హాస్పటల్‌ బెడ్‌ పైన ఉండే ఆ పది సినిమాలకు డబ్బింగ్‌ పూర్తిచేశారు. అది వింటే మీరు నమ్మనే నమ్మరు ఆయన పడుకునే డబ్బింగ్‌ చెప్పారని. అలా హాస్పటల్‌లో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఏడాదిన్నరకే మళ్లీ ఆయనకు సినిమాల్లో నటించే అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. కానీ కంగారు పడేవారు నేను చేయలేను అని. మీరు చేయగలరు, మీ గొంతు ఎక్కడికీ పోలేదు , మీ గళంలో గాంభీర్యం ఎక్కడికీ పోదు అని ఆయనకు స్థయిర్యానివ్వడానికి ప్రయత్నించేదాన్ని. అప్పుడు ఆయన మెల్ల మెల్లగా ధైర్యాన్ని తెచ్చుకుని సినిమాలు ఒప్పుకోవడం ప్రారంభించారు. వీల్‌ చైర్లో ఉన్న క్యారెక్టర్లైతే హాస్పటల్‌లోనే తీసుకునే వాళ్లు. మిగతా వాటికి షూటింగ్‌ ఎక్కడుంటే ఆ లొకేషన్‌కి వెళ్లి మళ్లీ హాస్పటల్‌ వచ్చేవారు. అలాగే ప్రతి ఆదివారాలూ ఇంటికి వచ్చి వెళ్తుండే వారు. ఇలా వచ్చి మళ్లీ ఆసుపత్రికి వెళ్లడం ఇంకా నరకం అనిపించేది మా ఇద్దరికీ కూడా. పిల్లలేమో నాన్నా... మళ్లీ హాస్పటల్‌కి ఎందుకు, ఇంట్లోనే ఉండిపోండి అంటూ ఏడ్చేవాళ్లు. ఇదంతా చూస్తూ చాలా డిప్రెషనలోకి వెళ్లేవారు ఆయన. ఒకరోజైతే నాకింక ఈ జీవితం వద్దు అని చాలా కుంగిపోయారు. అప్పుడు మా చిన్నమ్మాయి నాన్నా ...మీరు త్వరగా కోలుకుని ఇంటికి రండి నాన్నా అని పాపం అమాయకంగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఇంక అప్పుడు లేదు నేను బతకాలి, నా పిల్లల కోసమైనా నేను బతకాలి అనే రియలైజేషన్‌ వచ్చింది ఆయనలో. దీంతోనే ఆయన డిప్రెషన్‌లోంచి కూడా బయటపడ్డారు. డాక్టర్ల అంచనాల కంటే వేగంగానే ఆయన ఆరోగ్యం మెరుగవసాగింది.దెబ్బ మీద దెబ్బఅలా ఈ యాక్సిడెంట్‌ నుంచి కోలుకుని ఇలా ఇంటికి వచ్చామో లేదో పులి మీద పుట్రలా గుండె ఆపరేషన్‌కి మళ్లీ హాస్పటల్‌కి పరిగెత్తాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది అప్పుడు. అసలు డాక్టర్లు నమ్మకం లేదని చెప్పారు. నేను మళ్లీ ఒంటరి పోరాటాన్ని ప్రాంభించాను. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తను మళ్లా ఎక్కడ కుంగిపోతారో అని చాలా భయపడ్డాను. అప్పుడే కాస్త నడవడం కూడా స్టార్ట్‌ చేశారు, ఈ ఆపరేషన్‌తో అంతా మొదటికి వస్తుందేమో అని దిగులు పడ్డాను. కానీ ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. చిత్రంగా ఆపరేషన్‌ నుంచీ కూడా చాలా త్వరగా కోలుకున్నారు. నూటొక్క జిల్లాల అందగాడు.... నూటొక్క సినిమాలుయాక్సిడెంట్‌ కంటే ముందు ఆయన 365 సినిమాలు పూర్తిచేస్తే యాక్సిడెంట్‌ తర్వాత ఆయన పూర్తి చేసిన సినిమాలు 101. దీన్ని బట్టే చెప్పొచ్చు ప్రమాదంలో గాయపడింది ఆయన శరీరమే. కానీ మనసు కాదు. ఆయనలో అంతకు ముందున్న ఉత్సాహమే ఇప్పుడూ ఉంది. ఆ కంఠంలో గాంభీర్యం ఇంకా నూతన్‌ ప్రసాద్‌ ప్రత్యేకతను చాటుతూనే ఉంది. నాకు పెద్దపెద్ద ఆశలేం లేవు. ఆ భగవంతుడి దయవల్ల ఆయన ఆరోగ్యంతో ఇలా మా కళ్లముందు తిరుగుంతుంటే చాలు. యాక్సిడెంట్‌ సమయంలో మా వెన్నంటే ఉండి, ఎంతో ధైర్యాన్ని , అంతే సహాయసహకారాలనూ అందించిన సినిమా ఆప్తులందరికీ నేను రుణపడి ఉన్నాను. అలాగే ఏడేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో చేరి తర్వాత ఆయనకు అసిస్టెంట్‌గా మారి శ్రీరాముడి చెంతనున్న లక్ష్మణుడిలా ఎన్నో సేవలందిస్తున్న మా అసిస్టెంట్‌ నాగేశ్వర రావు మేలు ఈ జన్మలో మరిచిపోలేము. అన్నిటి కంటే ముఖ్యంగా ఆయన ఇవాళ మళ్లీ సినిమాల్లో కనిపిస్తున్నారంటే ఆ భగవంతుడి దయ, ఆయన అభిమానుల ఆశీర్వాదం. అవి సర్వదా మాకుండాలని ఆశిస్తున్నాను. ఆమే లేకపోతే ఇరవైయేళ్లు నిండేవి కావునూతన్‌ ప్రసాద్‌ యాక్సిడెంట్‌ను తలుచుకోవడం నాకిష్టం లేని విషయం. అన్నిటికంటే ముందు ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ప్రమాదం జరిగాక అందరూ చూడటానికి వచ్చినట్టే నా స్నేహితుడు నేరేళ్ల వేణూమాధవ్‌ కూడా వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆపకుండా ఓ రెండున్నర గంటలు మిమిక్రీ చేసి నన్ను తెగ నవ్వించేశాడు. అలా నవ్వుతూ ఉన్న నాతో .... నూతన్‌ ప్రసాద్‌ గారూ ....మీకేమీ కాలేదు. నేను మిమ్మల్ని ఏమీ అడగను. మీరు చాలా బావున్నారు, బావుంటారు కూడా. ఎవరైనా వచ్చి ఏమైందని అడిగినా ఏమీ చెప్పకండి. ఓ కాగితం మీద రాసి పెట్టండి. మీరు ప్రశాంతంగా రెస్ట్‌ తీసుకోండి. వచ్చిన వాళ్లు అది చదువుకుని వెళ్లిపోతారు. అని చెప్పి వెళ్లాడు. ఇది ఎందుకు చెప్పానంటే ఆ మాటలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయి అని తెలపడానికి మాత్రమే.అదలా ఉంచితే ఈ ప్రమాదం నుంచి నేను కోలుకోవడానికి నా భార్య నాకు అందించిన స్ఫూర్తి గురించి చెప్పాలంటే నేను ఒక్కటే మాట చెప్తాను..... యాక్సిడెంట్‌ జరిగి రేపటి ఫిబ్రవరికి ఇరవై యేళ్లు. ఆ విషాదంలో నా భార్య సపోర్టేగనక నాకు లేకపోతే ఈ ఇరవై యేళ్లు నిండేవి కావు. ఆమె అందించిన, అందిస్తున్న సహకారాన్ని చెప్పటానికి ఇంతకు మించిన మాటలు లేవు. ఆ ఆనందం కోసమేభార్యాభర్తలు అన్నాక ఒకరి కోసం ఒకరు. అయితే అన్నీ ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు చేదోడువాదోడుగా ఉండటమనేది వేరు. కానీ ఒక భయంకరమైన సంఘటనతో పేషంట్‌గా మారిన భర్తకు అన్నివిధాలా సపోర్ట్‌గా నిలవడమనేది చాలా కష్టసాధ్యమైన పనే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఆమె నాకు తల్లిలా మారింది. హాస్పటల్‌ బెడ్‌ మీదే ఉండి నేను ధైర్యంగా డబ్బింగ్‌ చెప్పినా, ప్రమాదం తర్వాత 101 సినిమాల్లో నటించినా దానివెనక ఉన్నదంతా ఆమె తపన, సహకారమే. అసలు నేను సినిమాల్లో నటించడానికి కారణం ఆమే యాక్సిడెంట్‌ కంటే ముందు తర్వాత కూడా. యాక్సిడెంట్‌ తర్వాత నాకు వేషాలు ఇవ్వడానికి ఇంటికి ఎవరైనా వచ్చారంటే తన కళ్లల్లో సంతోషం వెలిగిపోయేది. ఏమండీ.... మీ కోసం ఎవరో వచ్చారు. సినిమాల్లో రోల్‌ ఇవ్వడానికి అని ఆనందంతో వచ్చి చెప్పేది. ఆ ఆనందం చూడ్డం కోసమే నాకు మళ్లీ నటించాలనిపించేది. అదే నాలో ఉత్సాహాన్ని నింపేది. పిల్లలకు దూరమయ్యాను ఇవన్నీ పక్కన పెడితే.... ఒక్కటే బాధ నన్ను తొలిచేస్తూ ఉంటుంది ఇప్పటికీ. నాకు యాక్సిడెంట్‌ అయినప్పుడు పిల్లలు ముగ్గురూ చిన్న వాళ్లే. అంతకు ముందు సినిమా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉంటూ పిల్లలకు దూరంగానే ఉండేవాణ్ని. ఆ తర్వాత ఈ దుర్ఘటనతో దాదాపు మూడేళ్లు హాస్పటల్‌ ఉన్నాను వాళ్లకు దూరంగానే. వాళ్లను చదువులో కరెక్ట్‌గా గైడ్‌ చేయాల్సిన సమయంలో నేను వాళ్లకు దగ్గరగా లేను. ఈ డిస్టర్బెన్స్‌లో వాళ్లకు సరైన చదువులు చెప్పించలేకపోయానే, వాళ్ల కెరీర్‌ను తీర్చిదిద్దలేకపోయానే అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. దీంతో నాకూ పిల్లలకు మధ్య ఎడం ఎక్కువై వాళ్లెవరో నేనెవరో అనే భావన పెరిగింది. కానీ మా చిన్న మ్మాయి భాగ్యలక్ష్మితో మాత్రం చాలా ఎటాచ్‌మెంట్‌ ఉంది. రోజుకు నాలుగు సార్లైనా కాల్‌ చేస్తుంది నాకు. అయితే పిల్లలతో పంచుకోలేంది, పిల్లలకు ఇవ్వాల్సింది నా మనవరాళ్లతో పంచుకుంటున్నాను. అసలు కన్నా కొసరు ముద్దు అంటారు కదా. ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితంలో అన్నీ అనుకున్నట్టుగానే జరగవు. ఏది ఏదురైనా తట్టుకుని ముందుకు సాగే ధైర్యాన్ని అలవర్చుకోవాలి. మామూలుగా అన్నీ సవ్యంగా ఉన్నవాళ్లే బతకడానికి ప్రతి క్షణం పోరాడాల్సిన పరిస్థితి. అలాంటిది పేషంట్లు అయితే మరింత పాజిటీవ్‌ ధృక్కోణంతో ముందుకుసాగాలి. ఆ పేషంట్‌ కుటుంబ పెద్దయితే గనక ఎంతో తెగువను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మాత్రం ఆధైర్య పడినా ఆ ప్రభావం కుటుంబం పైన పడుతుంది కాబట్టి.

Monday, November 10, 2008

హాయ్

హాయ్ నా పేరు రమ.